● రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేసులో
నలుగురు నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి టౌన్: వరి కోత హార్వెస్టర్ మిషన్లను లీజుకు ఇస్తామని నమ్మించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడికి పాల్పడి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు ముఠా సభ్యులు ఎట్టకేటలకు పోలీసులకు చిక్కారు. దోమకొండ పోలీసులు వారిని అరెస్టు చేశారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర కేసు వివరాలను వెల్లడించారు. బీబీపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేశ్ హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన నిట్టూ నర్సింగరావు, ఇందల్వాయికి చెందిన ఎరుగు నగేష్, కోనాపూర్‌కు చెందిన చిందం శ్రీకాంత్ పలు కేసుల్లో జైలుకు వెళ్లగా, వారికి అక్కడ పరిచయం ఏర్పడింది. ముగ్గురు బయటకు వచ్చిన తర్వాత వారికి కోనాపూర్‌కు చెందిన తెడ్డూ సురేష్ పరిచయం అయ్యాడు. వీరింతా సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కోనాపూర్‌కే చెందిన మహేష్‌ను కిడ్నాప్ చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. నర్సింగరావు నెలరోజులుగా మహేష్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తానని నమ్మించాడు. అక్టోబర్ 22న రాత్రి మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను కోనాపూర్ శివారుకు పిలిపించారు. అక్కడ మహేష్‌ను కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేసి, రూ.10 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అతని వద్ద ఉన్న ఫోన్, పర్సులోని రూ.2,500 నగదును లాక్కున్నారు. అదే గ్రామానికి చెందిన మరో నిందితుడు చిందం శ్రీకాంత్ గ్రామంలోనే ఉంటూ బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసుల సమాచారాన్ని మిగతా వారికి చేరవేస్తూ సహకరించాడు.
నిందితులు నిద్రలోకి..
తప్పించుకున్న బాధితుడు
బాధితుడిని కారులో తిప్పుతూ బెదిరించిన నిందితులు, ఇందల్వాయిలోని ఓ దాబా వద్ద కారు ఆపి మద్యం సేవించి నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదనుగా భావించిన మహేష్ వారి చెర నుంచి తప్పించుకుని ఇందల్వాయి బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దోమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు నిందితులు సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫోన్ చేసి, తాము బీహార్‌కు చెందినవారమని, తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందుకే తీసుకెళ్లామని తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
మళ్లీ కిడ్నాప్‌నకు వచ్చి చిక్కారు..
బాధితుడు మొదటిసారి తీవ్ర భయాందోళనకు గురై పిల్లలున్నారని, ప్రాణాలు తీయవద్దని వేడుకోవడంతో అతడిని మరోసారి బెదిరించి డబ్బులు వసూలు చేయవచ్చని నిందితులు భావించారు. ఈక్రమంలో ఈనెల 9న అదే కారులో కోనాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద మరోసారి కిడ్నాప్‌నకు పథకం వేస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన కారు, బైక్, బాధితుడి ఫోన్‌తోపాటు మొత్తం 5 ఫోన్లు, ఉన్ని టోపీని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబరిచిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, భిక్కనూరు సీఐ నరేష్, దోమకొండ ఎస్సై ప్రభాకర్, కానిస్టేబుళ్లు సాయిబాబా, బాలకృష్ణ, భైరవప్రసాద్, హోంగార్డు శ్రీకాంత్‌లను ఎస్పీ అభినందించారు.


