కామారెడ్డి టౌన్: దీపావళి పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలతో పాటు పోలీస్స్టేషన్ల సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 108 కేసులు నమోదు చేసి 598 మందిని అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి రూ. 17.40 లక్షల నగదుతో పాటు మొబైల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలిపారు. పట్టుబడిన ఉద్యోగుల వివరాలను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 286 పేకాట కేసులు నమోదు చేసి 1,583 మందిని అరెస్టు చేయడంతో పాటు రూ.37 లక్షల నగదును సీజ్ చేశామని తెలిపారు.
కామారెడ్డి టౌన్ : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదానం చేసే రాష్ట్ర స్థాయి అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల అభ్యున్నతి, సాధికారతకు విశేష కృషి చేసిన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలను వచ్చేనెల 3న హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి వేడుకల్లో సత్కరిస్తామని పేర్కొన్నారు. అవార్డులకు సంబంధించిన దరఖాస్తు నమూనా, పూర్తి మార్గదర్శకాలను https://depwdsctgp.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అర్హులైన దివ్యాంగులు, సేవకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తమ దరఖాస్తులను తగిన ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 16వ తేదీలోపు కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో రూం 31లో అందజేయాలని సూచించారు.
కామారెడ్డి టౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 14 వరకు చివరి అవకాశం కల్పించినట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాలతో ఇప్పటివరకు కళాశాలల్లో చేరని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. 14వ తేదీ వరకు అన్ని అనుబంధ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ఎన్రోల్మెంట్ ప్రక్రియ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ రంగ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఎటువంటి ఆలస్య రుసుము ఉండదని, ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో చేరే విద్యార్థులు రూ. వెయ్యి అపరాధ రుసుముతో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) సెపక్ తక్రా 70వ రాష్ట్రస్థాయి అండర్–14 బాలబాలికల క్రీడల పోటీల ఎంపికల టెక్నికల్ అధికారిగా కామారెడ్డి ప్రెసిడెన్సియల్ హైస్కూల్ పీఈటీ నరేశ్ ఎంపికయ్యారు. సెపక్ తక్రా క్రీడలు ఈనెల 12, 13, 14 తేదీల్లో జనగామ జిల్లాకేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ జాతీయ స్థాయి సెపక్తక్రా పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయడంలో సాంకేతిక అధికారుల పాత్ర కీలకమన్నారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సమాఖ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
భిక్కనూరు: హెచ్ఐవీ రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైఆర్జీ కేర్ ఉమ్మడి జిల్లా రిసోర్స్ పర్సన్ సుధాకర్ కోరారు. సోమవారం భిక్కనూరు పీహెచ్సీలో నిర్వహించిన ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో హెచ్ఐవీ, సుఖ వ్యాధులు, టీబీపై అవగాహన కల్పిస్తూ, వ్యాధిగ్రస్తులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. హై రిస్క్ సముదాయాన్ని గుర్తించి, అవగాహన కల్పిస్తూ నివారణ జాగ్రత్తలను వివరిస్తున్నామన్నారు. ఆయా వ్యాధుల పరీక్షలు, ఆరోగ్య సేవల కోసం ప్రభుత్వ ఆస్పత్రులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


