కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి, దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించారు. మొత్తం 45 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఆశలతో ప్రజావాణికి వస్తారని, వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తుపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పరిష్కారానికి తీసుకున్న చర్యల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, జిల్లా పరిషత్ సీఈవో చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


