యుద్ధాలతో ఆందోళన...
రష్యా సైనికుల చెరలో పలువురు..
మెతుకు వేటలో
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: నాలుగు డబ్బులు సంపాదించాలన్న ఆశతో కన్నోళ్లను, కట్టుకున్నోళ్లను వదిలేసి దేశంగాని దేశం పోయినోళ్ల బతుకులు ఆగమవుతున్నాయి. ఏజెంట్ల చేతిలో మోసపోయిన వాళ్లు కొందరైతే.. అక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు, దేశాల మధ్య జరుగుతున్న దాడులు... ఇలా వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నవారు మరికొందరు.. ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, వివిధ దేశాలపై జరుగుతున్న దాడులతో.. ఆయా దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబాలకు కంటిమీద కునుకు కరువయ్యింది. ఇటీవల రియాద్ నగరంలోని కింగ్ ఖాలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన క్షిపణి దాడిలో గాయపడిన కామారెడ్డి పట్టణంలోని సైలానీబాబా కాలనీకి చెందిన షేక్ సయీద్ ఈనెల 3న మృతిచెందాడు. సయీద్ మరణ వార్త తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
వేలాది మంది..
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఆయా దేశాల్లో నిర్మాణరంగం, క్లీనింగ్, ఇతర పనుల్లో మన వాళ్లు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. రెండు మూడేళ్లకోసారి ఇంటికి వచ్చిపోతుంటారు. అయితే అక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు మరణాలు ఏటా పదుల సంఖ్యల ఉంటున్నాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన అర్కల రాము అనే యువకుడు గతనెల 10 న కువైట్‌లో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఇలా ప్రమాదాలతో వలస కుటుంబాలు మనోవేదనకు గురవుతుండగా.. యుద్ధాలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగు డబ్బులు సంపాదించాలని వెళ్లిన వారు అక్కడ ఉద్రిక్త పరిస్థితులతో ఏం జరుగుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఏడెనిమిది నెలలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గినట్టే తగ్గినా తిరిగి పెరుగుతుండడంతో వారి కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు వలస కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు ఇరాన్‌పై జరిపిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రతిగా ఇరాన్ గల్ఫ్‌లోని ఇతర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. ఆయా దేశాల మధ్య జరిగిన, జరుగుతున్న దాడులతో ఇరాన్, కువైట్, బహ్రెయిన్, ఇజ్రాయిల్, జోర్డాన్, ఖతార్, ఒమన్, సిరియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ఉన్న మనోళ్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. వారి కుటుంబాలు ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి.
మంచి జీతం అంటూ ఏజెంట్ల మాటలు నమ్మి రష్యా దేశానికి వెళ్లిన ఎంతో మంది జీవితాలు నరకప్రాయంగా మారాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన అఫ్జల్ ఖాన్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల తదితర జిల్లాలకు చెందిన పలువురు రష్యా ఆర్మీలో చిక్కుకున్న విషయం తెలిసిందే. తాజాగా కామారెడ్డి పట్టణంలోని గుమస్తా కాలనీకి చెందిన సుప్పన్ స్వామి అనే యువకుడితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన దొమ్మాటి కిషన్, వరంగల్ కాశీబుగ్గకు చెందిన పోతరాజు విజయ్‌కృష్ణ, జగిత్యాల జిల్లా బండలింగాపూర్‌కు చెందిన మద్దుల బాలగంగాధర్, కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన ముక్కెర రాజ్‌కుమార్ తదితరులు రష్యా ఆర్మీ చెరలో చిక్కారు. వారిని విడిపించాలని కుటుంబ సభ్యులు ఇటీవలే ప్రవాసీ ప్రజావాణిలో మొరపెట్టుకున్నారు.
సౌదీ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో
గాయపడిన యువకుడి మృతి
రష్యా సైన్యం చెరలో జిల్లాకు
చెందిన మరో యువకుడు బందీ
వలస కుటుంబాల్లో పెరిగిన ఆందోళన


