ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

లింగంపేట: జిల్లాలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దడంతో పాటు నీటి పరిరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టి పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలపాలన్నదే లక్ష్యమని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన లింగంపల్లి(ఖుర్దు)లో పర్యటించారు. ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థ్యాల సేకరణ, పర్యావరణ హిత ఇటుకల తయారీ, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు రబీ సీజన్‌లో జొన్న, మక్క, సోయాబీన్‌, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల పంటలు సాగుచేసుకోవాలని సూచించారు. ఆయిల్‌పామ్‌కు ఇచ్చే రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జొన్నల సాగుకు అవసరమైన విత్తనాల పరిమితిని 8 క్వింటాళ్లకు పెంచాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌కు సూచించారు. ప్లాస్టిక్‌ వినియోగంతో ఎదురవుతున్న అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు చేసిన నాటికలు, నృత్యరూపక ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం గ్రామస్తులకు జూట్‌ బ్యాగులు, వాటర్‌ బాటిళ్లు, టిఫిన్‌ బాక్సులు, విద్యార్థులకు నోటుబుక్కులు పంపిణీ చేశారు.

చెరువు కట్టపై సౌర విద్యుత్‌కు చర్యలు..

గ్రామ శివారులోని చెరువుకట్టపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. చెరువుకట్ట ఆవరణలో సౌర విద్యుత్‌ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలించి, ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రత్యూష, అదనపు కలెక్టర్‌ ఎన్‌వై గిరి, డిప్యూటీ సీఈవో సురేందర్‌, డీఏవో మోహన్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో ప్రవీణ్‌ కుమార్‌, ఎంఈవో అంజల్‌రెడ్డి, ఎంపీవో మలహరి, ఏపీఎం వినోద్‌, ఏపీవో నరేందర్‌, నాయకులు సాయిరాంయాదవ్‌, సంతోష్‌, కాశీరాం, పోచయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాలను

ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలి

నీటి సంరక్షణ చర్యలను

విస్తృతంగా చేపట్టాలి

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement