అలరించిన జడకొప్పు
● నేడు దసరా వేడుకలు
● సొంతూళ్లకు చేరిన జనం
● జిల్లా కేంద్రంలో లేజర్ షోకు ఏర్పాట్లు
కామారెడ్డిలో లేజర్ షోకు హాజరైన ప్రజలు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశిమి. పండుగ రోజున జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించి పాల పిట్టను వీక్షిస్తే శుభాలు కలుగుతాయని ప్రతీతి. ఈ నెల 20న మంగళవారం విజయ దశమి పండుగను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య జరుపుకోనున్నారు. దసరా సెలవులు మొదలైన తర్వాత పట్టణాలు, దూర ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం వెళ్లిన వారంతా పల్లెలకు చేరుకున్నారు. దీంతో ఇళ్లన్నీ సందడిగా మారాయి. దసరా పండుగ నాడు కొత్తబట్టలు ధరించి పాలపిట్టను చూడడానికి పచ్చని పొలాల వెంట వెళ్లడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకున్న తర్వాత ఆలయాలకు వెళ్లి పూజలు చేసి తమకు విజయాలు వరించాలని కోరుకుంటారు. అనంతరం స్నేహితులు, బంధుమిత్రులందరికీ జమ్మి (బంగారం) పంచుతూ అలాయ్ బలాయ్ తీసుకుంటారు. పెద్దల ఆశీర్వాదాలు పొందుతారు.
జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు ఏర్పాట్లు
కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దసరా ఉత్సవాల్లో భాగంగా లేజర్ షో, టపాసుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆరేడేళ్లుగా ఉత్సవాలు నిర్వహించడం లేదు. ఈసారి మళ్లీ ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఉత్స వాలు ప్రారంభమవుతాయి. వేడుకల్లో భాగంగా పది తలల రావణాసురుడి ప్రతిమ దహనం నిర్వహించనున్నారు. వేలాది మంది ప్రజలు షోను తిలకించేందుకు రానున్నారు.
కామారెడ్డి మండలం గర్గుల్‌లో రావణ చిత్రపటం దహనానికి చేసిన ఏర్పాట్లు
కామారెడ్డి టౌన్: దసరా పండుగ సందర్భంగా జిల్లా కేంద్రంలో సందడి నెలకొంది. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన మార్కెట్లు, కూడళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పూలు, మామిడి ఆకులు, గుమ్మడికాయలు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆటో మొబైల్ షోరూంలలో నూతన వాహనాల కొనుగోళ్లు జోరుగా సాగాయి. వాహనాలకు కట్టే నిమ్మకాయలు, మిరపకాయల దిష్టి దండలు, దిష్టి బొమ్మలు, పూల దండల దుకాణాలు సైతం కొనుగోలుదారులతో రద్దీగా కనిపించాయి.
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): దసరా ఉత్సవాలలో భాగంగా నాగిరెడ్డిపేట మండలంలోని చీనూర్‌లో సోమవారం కోలలు ఆడుతూ వేసిన జడకొప్పు చూపరులను ఎంతగానో అలరించింది. గ్రామానికి చెందిన పలువురు యువకులు గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద జడకొప్పు వేశారు. ఒక కోల, గుమ్మడికాయ, కొబ్బరికాయ, రాగిచెంబులో నీటిని జడకొప్పులో పెట్టి అల్లారు. దసరా పండుగ సందర్భంగా మంగళవారం మళ్లీ యువకులు కోలలు ఆడుతూ జడకొప్పును విప్పనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
గుమ్మడికాయలు, పూల విక్రయాలు


