ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు

Oct 20 2026 1:44 AM | Updated on Oct 20 2026 1:44 AM

ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు గుండూర్‌లో చిరుతపులి సంచారం నవంబర్‌ 1 నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక ‘సాగర్‌’ నీటి విడుదల పెంపు ఏఐసీసీ పరిశీలకుడిగా తోట లక్ష్మీకాంతారావు

కామారెడ్డి టౌన్‌ : విజయదశమి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాల్లో శాంతిసౌఖ్యాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలని సూచించారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): జుక్కల్‌ మండలం గుండూర్‌ శివారులో చిరుత పులి సంచారంతో ప్రయాణికులు, వాహన చోదకులు భయాందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి చిరుత పులి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు సెల్‌ఫోన్‌లలో ఫొటోలు తీశారు. వాహనదారుల అరుపులతో చిరుత రోడ్డు పక్కన ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. గుండూర్‌తోపాటు వజ్రకండి, బస్వాపూర్‌, జుక్కల్‌, దోస్త్‌పల్లి, డోన్‌గావ్‌, లాడేగావ్‌, బంగారుపల్లి పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తోంది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

కామారెడ్డి రూరల్‌: రేషన్‌ బియ్యం పంపిణీ నవంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. నవంబర్‌ నెలలో రేషన్‌ బియ్యానికి సంబంధించి అలాట్‌మెంట్‌ విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌): మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన బి.క్రిష్ణ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 బాలుర రగ్బీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ శ్రీధర్‌ తెలిపారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ ఎంబీ హోమ్స్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కృష్ణ ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో క్రిష్ణ తెలంగాణ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా కృష్ణను హెచ్‌ఎం కమల, పీడీ సత్యం అభినందించారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టు కింద పంటలకు సాగు నీరు అత్యవసరం కావడంతో వెయ్యి క్యూసెక్కుల చొప్పున ఉన్న నీటిని 1,500 క్యూసెక్కులకు పెంచినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఆయకట్టు పంటలకు సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్థిస్తాయి నీటిమట్టం 1405 అడుగుల (17.8 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1398.85 అడుగుల (10.164 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): ‘ఓట్‌ బచావో– దేశ్‌ బచావో’ కార్యక్రమంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఏఐసీసీ పరిశీలకుడిగా జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును నియమించారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement