రైతుల అభివృద్ధికి తోడ్పాటు
● జిల్లాలో 22 సొసైటీలు
ఎఫ్‌పీవోలుగా ఎంపిక
● ప్రతి ఎఫ్‌పీవోలో 750 మంది రైతులు
ఎల్లారెడ్డిరూరల్: రైతులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పలు ప్రాథమిక సహకార సంఘాలను ఫార్మర్ ప్రొడ్యూసర్(ఎఫ్‌పీవో)లుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతులు స్వయంగా వ్యాపారాలు చేసుకోవడం, ఎక్విప్‌మెంట్లు కొనుగోలు చేసుకుని వ్యాపారాలు నిర్వహించి ఆదాయాన్ని పెంచుకునేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లాలో 56 ప్రాథమిక సహకార సంఘాలు..
జిల్లాలో 56 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. వీటిలో 22 సొసైటీలు కామారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, తాండూర్ కిచ్చన్నపేట, దోమకొండ, అడ్లూర్ ఎల్లారెడ్డి, బీబీపేట, పెద్ద కొడప్‌గల్, లింగంపేట, గాంధారి, నాచుపల్లి, ఆర్గొండ, చిల్లర్గి, బాన్సువాడ, సదాశివనగర్, జంగంపల్లి, తాడ్వాయి, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, గున్కుల్, మద్నూర్ సొసైటీలను ఎ ంపిక చేశారు. వీటిలో ఇప్పటికే కామారెడ్డి, చిల్లర్గి, ఆర్గొండ, బీబీపేట, పెద్దకొడప్‌గల్ సొసైటీలు లక్ష్యాన్ని సాధించాయి. వీటిలో 750 మంది రైతులు సభ్యత్వం తీసుకున్నారు. వారం రోజుల్లో మిగితా సొసైటీలలో సైతం రైతులు సభ్యత్వం పూర్తికానుంది.
రూ. 30 లక్షలతో వ్యాపారం..
జిల్లాలో ఎంపిక చేసిన ఎఫ్‌పీవోలలో 750 మంది రైతులు ఉంటారు. ప్రతి రైతు రూ. 2వేలు చెల్లించి ఎఫ్‌పీవో సభ్యత్వాన్ని తీసుకోవాలి. దీనికి ప్రభుత్వం రైతుల పేరిట మరో రూ. 2వేలు జమ చేస్తుంది. ప్రతి ఎఫ్‌పీవోలో రైతుల వాటా రూ. 15 లక్షలు ఉండగా ప్రభుత్వం మరో రూ. 15 లక్షలు జమ చేస్తుంది. రూ. 30 లక్షలతో చేసిన వ్యాపారం ద్వారా వచ్చిన లాభాన్ని 750 మంది రైతులకు అందిస్తుంది. ఇలా రైతుల అభివృద్ధికి తోడ్పడుతుంది.
జిల్లాలో ఉన్న ప్రాథమిక సహకార సంఘాలలో 22 సొసైటీలు ఎఫ్‌పీవోలుగా ఎంపికయ్యాయి. వీటిలో 750 మంది రైతులు సభ్యత్వాన్ని తీసుకుంటారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ఎఫ్‌పీవోలను ఏర్పాటు చేసింది. రైతులు జమ చేసిన రూ. 15 లక్షలకు ప్రభుత్వం మరో రూ. 15 లక్షలు జమచేసి రైతుల అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంది.
– రామ్మోహన్‌రావు, డీసీవో, కామారెడ్డి


