సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై కుల వివక్ష ప్రదర్శించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలు క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ డిమాండ్ చేశారు. దీనిపై నిలదీసిన రాహుల్ గాంధీపై పెట్టిన కేసును ఎత్తివేయాలన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ ఎదుట ఉన్న మహనీయుల విగ్రహాల వద్ద జరిగిన కార్యక్రమంలో షబ్బీర్‌అలీ మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే పాల్గొన్న కార్యక్రమంలో ఆయన తిరిగిన ప్రదేశాన్ని శుద్ధి చేయడం దారుణమన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పదవికి రాజీనామా చేయాలి
ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు పొందుతున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఉన్నాడని షబ్బీర్ విమర్శించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఇక్కడి ప్రజలు అరవై వేల ఓట్లు వేశారని, భారీ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడితే ఒక్కరోజైనా బాధితులను పరామర్శించాడా అని నిలదీశారు. కామారెడ్డి ప్రజలను పట్టించుకోని కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ధర్నాలు చేయడం దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు. కామారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి రూ.105 కోట్లు మంజూరు చేశారని, టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే పనులు మొదలవుతాయని పేర్కొన్నారు. ఆందోళనలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ, పీసీసీ జనరల్ సెక్రెటరీలు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు సందీప్, శ్రీనివాస్‌రెడ్డి, పున్న రాజేశ్వర్, ఇలియాస్, సుధాకర్‌రెడ్డి, భీంరెడ్డి, పాతరాజు, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీపై నమోదు చేసిన
కేసు ఎత్తివేయాలి
ప్రభుత్వ సలహాదారు
షబ్బీర్ అలీ డిమాండ్
జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ


