కామారెడ్డి టౌన్/మద్నూర్/బీబీపేట/బాన్సువాడ రూరల్ : నీట్ పరీక్షల పేపర్ లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన విద్యాసంస్థల బంద్ శుక్రవారం విజయవంతమైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించాయి. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. లీకేజీల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర మంత్రి తన పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, బీవీఎం, ఏఐవైఎఫ్ నాయకులు శివప్రసాద్, జబ్బార్, ముదాం ప్రవీణ్, అరుణ్, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. మద్నూర్, బీబీపేట, బాన్సువాడలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలను విద్యార్థి సంఘాల నాయకులు బంద్ చేయించారు.


