మైనారిటీ జూనియర్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను ఈనెల 27న స్పాట్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలకు 5, క్రైస్తవులకు, బీసీ,ఎస్సీ,ఎస్టీ, ఓసీలకు 4 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 897884 7884 నంబర్‌కు సంప్రదించవచ్చన్నారు.
నేడు కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
కామారెడ్డి టౌన్ : నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సాయంత్రం 5 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, పార్టీ శ్రేణులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈకార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు
తెలిపిన ముజీబొద్దీన్
కామారెడ్డి క్రైం: బీఆర్‌ఎస్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబొద్దీన్ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. 50 వసంతాలు పూర్తిచేసుకున్న కేటీఆర్‌కు పూల మొక్కను అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యకలాపాలపై చర్చించారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇందిరా పార్కు ధర్నాకు తరలిన
బీఆర్‌ఎస్ నేతలు
బాన్సువాడ రూరల్/లింగంపేట: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తోందని రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శనకు బాన్సువాడ నుంచి తరలివెళ్లామన్నారు. విద్యార్థులు, యువతపై కేంద్ర ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోందన్నారు.అలాగే లింగంపేట నుంచి బీఆర్‌ఎస్ నాయకులు ఈధర్నాకు తరలి వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ముదాం సాయిలు మాట్లాడారు.
బోర్‌బావుల వద్ద ఇంకుడు గుంత
బాన్సువాడ రూరల్: సింగూరు ప్రాజెక్టులో నీటిసామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో నీటి సమస్య రాకుండా ఉండటానికి గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద ఉపాధిహామీ (వీబీజీ ఆర్‌ఏయంజీ) నిధులతో ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని సోమ్లానాయక్ తండా, సంగోజీపేట్ గ్రామ పంచాయతీ బోరుబావుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం కోసం మార్కవుట్ ఇచ్చారు. జీపీ కార్యాలయ ఆవరణలో, పాఠశాల ఆవరణలో ఎంపీడీవో ఆనంద్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. మండల పంచాయతీ అధికారి మహిబూబ్, టెక్నికల్ అసిస్టెంట్ గోపి, సర్పంచ్ మీరిబాయి చందర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనాన్ని ప్రతిరోజు పర్యవేక్షించాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంటలను ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షించాలని మండల అభివృద్ధి అధికారి ఆనంద్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని సంగోజీపేట్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.
విద్యార్థిపై యువకుల దాడి
బీబీపేట: మండల కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిపై శుక్రవారం నలుగురు యువకులు దాడి చేశారు. వివరాలు ఇలా.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి స్థానిక హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల నుంచి హాస్టల్‌కు రోడ్డుపై నుంచి వెళ్తున్న క్రమంలో నలుగురు గ్రామానికి చెందిన యువకులు ఏదో పాఠశాలలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థిపై దాడి చేశారు. విద్యార్థి ముఖానికి గాయాలయ్యాయి. హెచ్‌ఎం వెంటనే అక్కడికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సదరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థి ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యునికి చూయించారు.


