బోధన్‌టౌన్: గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని వీక్లీ మార్కెట్ వద్ద సీపీఎం, సీపీఐఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వంట గ్యాస్ కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని చెబుతుంటే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణ కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ సిలిండర్ల కోసం కార్యాలయానికి వెళ్తే నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ బుక్ చేసుకొని ఎనిమిది రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు రాజు, రాములు, పోశెట్టి, సాయిలు, గౌస్, హైమద్, అమీర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


