అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై దాడి చేయడం.. ప్రతిగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబులతో విరుచుకు పడుతుండడంతో వలస కార్మికుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వీడియో కాల్స్ చేస్తూ క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
జిల్లాలోని పలు మండలాల నుంచి యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్ తదితర దేశాలకు వేలాది మంది వలస వెళ్లారు. చాలా మంది క్లీనింగ్, గార్డెనింగ్, డ్రైవింగ్, హోం మేకర్, ఆఫీస్ బాయ్ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు. కువైట్, సౌదీ, యూఏఈ, ఖతర్ తదితర దేశాలపై ఇరాన్ దేశం దాడులకు దిగడంతో ఆయా దేశాల్లో ఉన్న తమ వారి క్షేమ సమాచారం గురించి కుటుంబ సభ్యులు తెలుసుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఇంతకుముందులా బయటకు తిరగవద్దని జాగ్రత్తలు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయా దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకోవడమే కాదు కొన్ని ప్రాంతాల్లో క్షిపణి, డ్రోన్ దాడులు జరుగుతుండడంతో వలస కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. రోజూ పొద్దున, పగలు, రాత్రి కాల్స్ చేసి మాట్లాడుతున్నారు. తాము క్షేమంగానే ఉన్నామంటూ వాళ్లు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఆందోళన చెందవద్దని కన్నవారికి, కట్టుకున్న వారికి ధైర్యం చెబుతున్నారు. కాగా ప్రసారమాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లో గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల గురించి వస్తున్న వార్తా కథనాలు వలస కుటుంబాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
గల్ఫ్ దేశాల్లో యుద్ధ మేఘాలు
వలస కార్మిక కుటుంబాల్లో ఆందోళన
ఫోన్లు చేసి క్షేమ సమాచారాలు
తెలుసుకుంటున్న జిల్లావాసులు
బయట తిరగొద్దంటూ జాగ్రత్తలు


