నిజాంసాగర్: జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకున్నందుకు ఆయన అభినందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నిజాంసాగర్: పంటలకు సాగునీరందించేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువకు బాన్సువాడ మండల పరిధిలో బుంగపడడంతో పది రోజుల నుంచి సాగు నీరు లేక పొలాలు ఎండుతున్నాయి. బుంగకు మరమ్మతు పనుల నేపథ్యంలో లీకేజీ నీటిని మంజీర నదిలోకి మళ్లించడంతో జలాలు వృథా అవుతున్నాయి. అయితే మహమ్మద్‌నగర్ మండలం గాలీపూర్ గ్రామ రైతులు ఈ నీటిని తమ పంటలకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం ప్రధాన కాలువలో అడ్డుకట్ట వేసి నీటిని డిస్ట్రిబ్యూటరీకి మళ్లించారు. బుంగ మరమ్మతులు పూర్తయిన తర్వాత ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు సాగు నీటిని విడుదల చేస్తామని నిజాంసాగర్ ప్రాజెక్టు ఈఈ సోలొమన్ తెలిపారు.
నవీపేట: మండలంలోని బాసర రహదారిపై వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. మండలంలోని అబ్బాపూర్(ఎం) – జగ్గా రావ్ ఫారమ్ గ్రామాల మధ్య బాసర రహదారి పక్కన ఓ చెట్టు కూలేందుకు సిద్ధంగా ఉంది. దుండగులు చెట్టు అడుగు భాగంలో నిప్పు పెట్టగా ప్రస్తుతం అది ఎండిపోయింది. ఆకులు రాలిపోయి.. ఎండిపోయిన కొమ్మలతో ఆ చెట్టు రహదారిపై వంగి ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఈ దారి గుండా నిత్యం వందల సంఖ్యలో భారీ వాహనాలు, వేల సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో రహదారిపై చెట్టు కూలిపోయి పెను ప్రమాదం జరగక ముందే అధికారులు స్పందించి, తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


