మహిళా సంఘాల సభ్యులు.. బస్సు ఓనర్లు
సంతోషకరం..
ప్రతిపాదనలు సిద్దం..
● జిల్లాలోని 22 మండలాల
సమాఖ్యలకు అవకాశం
● సెర్ప్ ద్వారా బస్సుల
కొనుగోళ్లకు రుణాలు
ఎల్లారెడ్డి: రాష్ట్రంలోని మహిళా సంఘాలు మరింత ఆర్థిక సాధికారత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. ఈనేపథ్యంలోనే మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేయడానికి రుణాలను మంజూరు చేయాలని సెర్ప్ సంస్థకు ఆదేశాలిచ్చింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఆర్టీసీ అద్దె బస్సులకు యజమానులు కానున్నారు. ప్రతీ మండల సమాఖ్య ఒక్కోటి చొప్పున కొనుగోలు చేసి ఆర్డీసీకి అద్దెకు ఇచ్చేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్టీసీకి అద్దెతో ఆదాయం..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 మండల సమాఖ్యలు ఉండగా వాటికి 22 బస్సులను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో బస్సు విలువ 36 లక్షల రూపాయలు ఉండటంతో సెర్ప్ నుంచి ఒక్కో బస్సుకు రూ.30 లక్షల చొప్పున 22 సంఘాలకు రూ.6,60,00,000 రుణాలు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ప్రతీ మండల సమాఖ్య ఇందుకు గాను రూ.6 లక్షలను చెల్లించనున్నారు. మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేశాక ఆర్టీసీ సంస్థకు అద్దెకు అందజేస్తాయి. ఇందుకు గాను ఆర్టీసీ సంస్థ ప్రతీ నెలా రూ.69,468 అద్దె మహిళా సంఘాలకు అందిస్తాయి. ఈ డబ్బులతో తాము తీసుకున్న రుణాన్ని ఏడు సంవత్సరాల కాలంలో పూర్తిగా చెల్లిస్తారు. జిల్లాకు వచ్చే కొత్త బస్సులను రద్దీగా ఉండే రూట్లలో తిప్పేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అందించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రయాణీకుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఆర్టీసీకి కూడా అదనపు బస్సులు అవసరమవుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా బస్సులు అదనంగా లభించడంతో ఆర్టీసీ అధికారులకు కూడా అదనపు భారం తప్పనుంది. ఇరువర్గాలకు లాభమయ్యే ఈ పథకం తప్పక విజయవంతం అవుతుందని సెర్ప్ అధికారులు అంటున్నారు.
మహిళా సంఘాల సభ్యులకు బస్సులను అందించడం సంతోషకరం. వీటిని ఆర్టీసీ వారు అద్దెకు తీసుకుని నెలనెల అద్దె డబ్బులు ఇవ్వడం వలన ఈఎంఐ చెల్లించడం బాగుంది. భవిష్యత్తులో మరిన్ని బస్సులు ఇస్తే బాగుంటుంది.
– పావని, మండల సమాఖ్య
అధ్యక్షురాలు, ఎల్లారెడ్డి
మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేందుకు ప్రతిపాదనలు పూర్తయ్యాయి. నెల రోజుల్లో మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేస్తాం. అద్దెకు బస్సులను తీసుకోవడానికి ఆర్టీసీ అధికారులు కూడా అంగీకరించారు. ఇరువర్గాలకు లాభమయ్యే ఈ పథకం తప్పకుండా మంచి ఫలితాలను ఇవ్వనుంది.
– సురేందర్, పీడీ, డీఆర్డీవో
మహిళా సంఘాల సభ్యులు.. బస్సు ఓనర్లు


