
తాళం వేసిన ఇంట్లో చోరీ
రుద్రూర్: తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడిన ఘటన పోతంగల్ మండల కేంద్రంలో జరిగింది. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన మొండి రాములు ఆదివారం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని రెండున్నర తులాల బంగారం, 38 తులాల వెండి ఆభరణాలు దుండగులు అపహరించుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
ఖలీల్‌వాడి: నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి (35) ఉరేసుకొని మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ రంగు టీ షర్టు, నేవీ బ్లూ రంగు ప్యాంట్ ఉందని పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లభించలేవని, మృతదేహాన్ని జీజీహెచ్‌లోని మార్చురీలో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే మూడో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూం కాలనీలో నివాసముండే గులాం జిలానీ(50) ప్రమాదవశాత్తు తాడ్కోల్ శివారులోని బీడీ వర్కర్స్ కాలనీలోని డ్రెయినేజీలో పడి మృతి చెందాడు. బాన్సువాడలోని ఓ హోటల్‌లో పనిచేసే జిలానీ శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి బయల్దేరాడు. ఆదివారం రాత్రి వరకు అతని ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం కాలనీలో దుర్వాసన రావడంతో గుర్తించిన స్థానికులు పోలీసులకు సమా చారం అందించారు. మృతుడిని జిలానీగా గుర్తించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య షహనాజ్ ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సిరికొండ: మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెల్లం లక్ష్మి (60) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. లక్ష్మి, ఆమె భర్త నడ్పి గంగయ్య కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గ్రామంలో ఎదురుగా వచ్చిన ద్విచక్రవాహనం వీరి వాహనానికి తగిలింది. దీంతో భార్యాభర్తలు వాహనంపై నుంచి కిందపడిపోయారు. గాయాలపాలైన లక్ష్మిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ