
రైతులంతా ఏకం కావాలి
గాంధారి(ఎల్లారెడ్డి): రాజకీయాలు, కులమతాలకు అతీతంగా రైతులందరూ ఏకమై సమస్యల పరిష్కారానికి పోరాడాలని భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరంగారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో సోమవారం బీకేఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో రైతు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అథితిగా రాష్ట్ర అధ్యక్షుడు హాజరై మాట్లాడారు. అన్ని రంగాల్లో స్థిరపడ్డవారు ఆర్థికంగా ఎదుగుతున్నారని, రాత్రింబవళ్లు ఎండనకా, వాననకా కష్టపడే రైతులు మాత్రం ఆర్థికంగా, మానసికంగా కృంగి పోతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన మార్కెట్ సౌకర్యాలు, గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. వ్యాపారులు విత్తనాలు, పురుగు మందులను వారి ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమస్యల పరిష్కారానికి రైతులంతా ఏకమై ప్రభుత్వంతో పోరాడాలని పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనంద్‌రావు, విఠల్‌రెడ్డి, శంకర్‌రావు, రావు సాహెబ్‌రావు, మధుసూధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.