
వికటించిన మధ్యాహ్న భోజనం
● 22 మందికి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
● విచారణకు ఆదేశించిన సబ్‌కలెక్టర్ కిరణ్మయి
బిచ్కుంద : శెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో సోమ వారం మధ్యాహ్న భోజనం వికటించింది. 26 మంది భోజనం చేయగా.. 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన గంటకే కడుపునొప్పి, వాంతులు చేసుకున్నారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వెంటనే అంబులెన్స్‌లో బిచ్కుంద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు స్వప్నాలి, కాళిదాస్ వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. నీరసంగా ఉన్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు అస్వస్థతకు గురైన సమాచారం తెలుసు కున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. కిచిడీ, మిల్‌మేకర్, సాంబారు, గుడ్లు తిన్నామని విద్యార్థులు తెలిపారు. బియ్యంలో నల్ల పురుగులు వస్తున్నాయని, మిల్‌మేకర్ ఉడక లేదని, రంగుమారి కలుషితమైన తాగునీరు వస్తున్నాయని విద్యార్థులు సబ్ కలెక్టర్‌కు వివరించారు. చాలారోజులనుంచి అన్నంలో పురుగులు వస్తున్నాయని, తినలేకపోతున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. సబ్ కలెక్టర్ డాక్టర్లతో మాట్లాడి విద్యార్ధుల ఆరోగ్య పరిస్ధితి ఎలా ఉందని తెలుసుకున్నారు. రాత్రి వేళలో శెట్లూర్‌కు వైద్య బృందాన్ని పంపించి పర్యవేక్షించాలని సబ్‌కలెక్టర్ ఆదేశించడంతో మెడికల్ ఆఫీసర్ బృందాన్ని పంపించారు. తహసీల్దార్ వేణుగోపాల్, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలకు వెళ్లి ఫుడ్ పాయిజన్‌కు కారణాలు తెలుసుకొని నివేదిక అందించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ్ అధికారులు వెళ్లి సరఫరా అవుతున్న నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపించాలన్నారు. గ్రామంలో పైప్‌లైన్‌కు లీకేజీలు లేకుండా చూడాలని, రోజు క్లోరినేషన్ చేసిన నీటిని సరఫరా చేయాలని సూచించారు. పురుగులు ఉన్న బియ్యం నిల్వలను వెంటనే వెనక్కి తెప్పించి, మంచి బియ్యం సరఫరా చేయాలని తహసీల్దార్‌ను ఆదేశించారు.

వికటించిన మధ్యాహ్న భోజనం