
పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు చర్యలు
● ప్రతినెలా కంపెనీలను తనిఖీ చేయాలి
● అధికారులకు కలెక్టర్ సంగ్వాన్ సూచన
కామారెడ్డి క్రైం : పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ పటాన్‌చెరు సమీపంలోని సిగాచి ఇండస్ట్రీస్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో 44 కార్మికులు మృత్యువాత పడిన నేపథ్యంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 331 జీవోను విడుదల చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో భద్రతకు సంబంధించి ప్రతినెలా తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరమైన సదుపాయాలు సమకూర్చుకోవాలని కంపెనీలకు సూచించారు. పరిశ్రమల యజమానులు ప్రమాణాలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డి, జీఎం లాలూ నాయక్, అధికారులు ప్రభుదాస్, లక్ష్మీప్రసాద్, సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్