
బోనస్ కథ కంచికేనా?
సన్నవడ్లకు దక్కని ప్రోత్సాహకం
● మూడు నెలలు దాటినా అందని డబ్బులు
● జిల్లాకు రావాల్సింది రూ.89 కోట్లు
● ఒక్క సీజన్‌కే పరిమితం.. నిరాశలో రైతులు
కామారెడ్డి క్రైం : జిల్లాలో గత యాసంగి సీజన్‌లో రైతులు 2,61,110 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో 60 వేలకుపైగా ఎకరాల్లో సన్న రకాలున్నాయి. పంట కొనుగోలు కోసం 446 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వాటిలో 63 కేంద్రాలను ప్రత్యేకంగా సన్నరకం ధాన్యాన్ని సేకరించడానికి కేటాయించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించారు. ఇందులో 1,78,416 మెట్రిక్ టన్నులు సన్న రకం ధాన్యం ఉంది. సేకరించిన ధాన్యానికి సంబంధించి సర్కారు రైతుల ఖాతాలలో మద్దతు ధరను మాత్రమే జమ చేసింది. బోనస్‌ను ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలలో సన్న వడ్లను విక్రయించిన 72,852 మంది రైతులు బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వంనుంచి రూ. 89 కోట్లు రావాల్సి ఉంది. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయి మూడు నెలలు గడిచినా బోనస్‌పై ఎలాంటి ప్రకటనా లేదు.
జిల్లా ప్రధాన పంట వరి. గతంలో రైతులు దొడ్డు రకాలనే ఎక్కువగా సాగు చేసేవారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తామనడంతో ఈ మధ్య సన్నాల వైపు మళ్లారు. సహజంగా సన్నాల కంటే దొడ్డు రకాలకే దిగుబడి ఎక్కువగా వస్తుంది. యాసంగిలో సన్నాల దిగుబడి తక్కువగా ఉంటుంది. అయితే ప్రభుత్వం బోనస్ ఇస్తామనడంతో రైతులు ఆశతో సన్నాల సాగుపై దృష్టి పెట్టారు. గత ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం ఎకరాకు రూ. 500 చొప్పున బోనస్ అందించింది. రబీకి సంబంధించి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలోనే బోనస్ ఇవ్వని సర్కారు.. ఖరీఫ్‌లో ఇస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోతే రైతులు మళ్లీ పాత పద్ధతిలో దొడ్డు రకాల సాగుకు మళ్లే అవకాశాలున్నాయి.
సన్న రకాల సాగును ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న బోనస్.. ఒక్క సీజన్‌కే పరిమితమయ్యింది. రబీలో సన్న వడ్లు పండించి కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన రైతులకు ఇప్పటికీ ప్రోత్సాహకం అందలేదు. పంటను విక్రయించి మూడు నెలలు దాటినా బోనస్ రాకపోవడంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు.

బోనస్ కథ కంచికేనా?