
మున్సిపల్ కార్మికులను క్రమబద్ధీకరించాలి
కామారెడ్డి టౌన్: మున్సిపల్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన యూనియన్ ఐదవ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏళ్లకు పైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో కార్మికులు చాలీచాలని వేతనాలకు వెట్టి చాకిరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలన్నారు. ప్రతి నెలా 1న కార్మికుల బ్యాంక్ అకౌంట్‌లో వేతనాలను వేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజనర్సు, మహబూబ్ అలీ, నాయకులు అరుణ్, దీవెన, కార్మికులు పాల్గొన్నారు.