
అంత్యక్రియలకు నిరీక్షించాల్సిందేనా?
● ఆఖరి మజిలీకి జాగ కరువు
● రామారెడ్డిలో అంత్యక్రియలకు అవస్థలు
రామారెడ్డి: రామారెడ్డిలో సగం జనాభాలో ఎవరైనా చనిపోతే పటేల్ చెరువు వైపు, సగం జనాభా చింతలకుంట వైపు, కొంత మంది సొంత స్థలాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. చింతలకుంట వైపు వైకుంఠధామం నిర్మించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పటేల్ చెరువు వైపు అంత్యక్రియలు నిర్వహించే వారికే శవం కూడా నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకేరోజు ఇద్దరు చనిపోతే ఒక శవానికి అంత్యక్రియలు పూర్తయ్యేదాకా మరో శవం నిరీక్షించాల్సిందే. ఎందుకంటే అక్కడ ఉన్నది ఆరు గజాల జాగే. ఆ అంత్యక్రియలు నిర్వహించేది కూడా పటేల్ చెరువు చివరిలోని 6 గజాల స్థలంలో మాత్రమే. ఆ ఆరు గజాల స్థలంలో నీళ్లు నిండితే అంత్యక్రియలకు జాగే ఉండదు. 2024 నవంబర్‌లో ఒకే రోజు ముగ్గురు చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. అదృష్టం ఏంటంటే ముగ్గురిదీ కూడా దహన సంస్కారాలే ఉండటంతో అది సాధ్యమైంది. ఖననం చేయాల్సి వస్తే చాలా ఇబ్బంది పడేవారు.
స్పందించిన ఎమ్మెల్యే....
గతంలో అంత్యక్రియలకు సంబంధించిన సమస్యను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. డీఆర్డీవోను గ్రామానికి పంపి మరో వైకుంఠధామం నిర్మించాలని ఆదేశించారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే 8,822 జనాభా ఉంటుంది. ప్రస్తుత ఆ జనాభా రెట్టింపైంది. అధికారుల నిర్లక్ష్యంతో చివరికి శవాలు కూడా అంత్యక్రియలకు నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ కల్పించుకొని రామారెడ్డిలో మరో వైకుంఠధామం నిర్మించి తమ అంత్యక్రియల కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.