విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

Aug 25 2025 8:21 AM | Updated on Aug 25 2025 8:21 AM

విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

విద్యుత్‌ తీగలు తగిలి రైతు మృతి

అనుమానాస్పదస్థితిలో ఒకరు..

భిక్కనూరు: దుక్కిదున్నుతున్న ట్రాక్టర్‌కు విద్యుత్‌ తీగలు తగలకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం నర్సన్నపల్లికి చెందిన చిదుర రాజిరెడ్డి(46) జంగంపల్లి శివారులో ఉన్న రాజంపేట మండలం బస్వన్నపల్లికి చెందిన ఆశిరెడ్డికి చెందిన ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఆదివారం ఆ భూమిని దున్నేందుకు రాజిరెడ్డి తన ట్రాక్టర్‌తో ఇంటి నుంచి పొలానికి వెళ్లాడు. పొలం దున్నుతుండగా బోరు బావికి కనెక్షన్‌ ఇచ్చిన సర్వీస్‌ వైరు ట్రాక్టర్‌కు తగులుతుందని దానిని పైకి లేపే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యుదాఘాతం సంభవించడంతో రాజిరెడ్డి ట్రాక్టర్‌పైనే ప్రాణాలు విడిచాడు. కొద్ది సేపటికి అటు వైపుగా వెళ్లిన రైతులు విషయాన్ని గమనించి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

జల్లాపల్లి ఫారంలో యువకుడు..

రుద్రూర్‌: పొతంగల్‌ మండలం జల్లాపల్లి ఫారం కు చెందిన షేక్‌ ముబీన్‌ (30) అనే యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు కోటగిరి ఎస్సై సునీల్‌ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ముబీన్‌ తన స్నేహితులతో కలిసి శనివారం చేపలు పట్టేందుకు స్థానిక గ్రామ చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ తీగ తగిలి కిందపడిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే బోధన్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ముబీన్‌ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ముస్కాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మాక్లూర్‌: మండలంలోని దాస్‌నగర్‌లో చిన్న గంగారాం(60) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై రాజశేఖర్‌ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్న గంగారాం గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. భార్య మూడు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. కుమారుడు, కోడలు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం కుమారుడు తండ్రి గంగారాంకు ఫోన్‌ చేస్తే స్పందించడం లేదని ఇంటి పక్కన ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వెళ్లి చూడగా ఇంటి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉందని, కిటికీల నుంచి చూడగా విగతజీవుడిగా ఉన్నట్లు కుమారుడికి సమాచారం అందించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement