
దేశ సేవ చేసేందుకు మళ్లీ సిద్ధం
భిక్కనూరు: దేశ సేవ చేసేందుకు ఎల్లప్పుడు మాజీ సైనికులు సిద్ధంగా ఉంటున్నారని కామారెడ్డి జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు బాపురెడ్డి అన్నారు. ఆదివారం తిప్పాపూర్‌లో జిల్లా స్థాయి మాజీ సైనికుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షుడు బాపురెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో క్యాంటీన్ సౌకర్యం కల్పించాలని, సంఘ భవన నిర్మాణానికి వెయ్యి గజల స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. త్వరలోనే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ సహకారంతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కామారెడ్డి జిల్లాలో మాజీ సైనికుల సంక్షేమం కోసం అవసరమైన వాటి గురించి విన్నవిస్తామన్నారు. అలాగే కామారెడ్డి జిల్లాలో సైనికుల కోసం ఆర్మీ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతామన్నారు. గతంలో ప్రభుత్వం సైనికులకు ఇచ్చిన భూములలో కొందరివి ఆక్రమించుకున్నారని వాటిని ప్రభుత్వం తిరిగి వీరికి ఇప్పించాలన్నారు. తమ సంఘం ఆద్వర్యంలో నూతనంగా సైన్యంలో చేరే యువతకు శిక్షణ ఇస్తామన్నారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపరి బీంరెడ్డి, సాయిరెడ్డి, మరో 50 మంది మాజీ సైనికులు పాల్గొన్నారు.