
రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి
మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే
మద్నూర్(జుక్కల్): భారీ వర్షాలతో దెబ్బతిన్న రైతులకు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే డిమాండ్ చేశారు. డోంగ్లీ మండలంలో దెబ్బతిన్న పంటలను గురువారం ఆయన బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. కేసీఆర్ రైతులకు పంట పెట్టుబడి సాయంగా రైతుబంధును అందించేవారని, 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత రైతులను విస్మరించిందని మండిపడ్డారు.
అధికారులకు ధన్యవాదాలు..
నాలుగు రోజుల క్రితం కురిసిన నియోజికవర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లలో ఎగువ భాగం నుంచి వరద నీరు వచ్చి చేరడంతో నిజాంసాగర్, కౌలాస్ నాలాల వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారన్నారు. దీంతో శెట్లూర్‌లో ముగ్గురు గొర్రెల కాపరులు, ఒక రైతుతో పాటు 656 గొర్రెలను ప్రాణాలతో కాపాడిన అధికారులకు, రెస్క్యూ టీం సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.