
క్రైం కార్నర్
మాచారెడ్డి: ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి పట్టణంలోని కల్కినగర్‌కు చెందిన మంగళి హన్మాండ్లు (45) తన బైకుపై గురువారం మాచారెడ్డి నుంచి కామారెడ్డి వైపు బయలుదేరాడు. అదే సమయంలో గజ్యానాయక్ తండా చౌరస్తాకు చెందిన కడమంచి పండరి తన బైకుపై కామారెడ్డి వైపు నుంచి మాచారెడ్డి వైపు వస్తున్నాడు. పాల్వంచ మండల కేంద్రం శివారులో వారు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నారు. ఈ ఘటనలో హన్మాండ్లు అక్కడికక్కడే మృతి చెందగా, పండరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం పండరిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ గ్రామంలో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు .. గ్రామానికి చెందిన తడకంటి అలియాస్ గుడాల గణేశ్ (30) హజ్గుల్ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకొని ఇల్లరికం వెళ్లాడు. అతడి తల్లి గతంలో భర్తను చంపి జైలుకెళ్లింది. అతడు తరచుగా కాస్లాబాద్ గ్రామానికి వస్తుండేవాడు. ఇటీవల అతడు కాస్లాబాద్ వెళ్లగా మద్యానికి బానిసై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గురువారం అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.