దోమకొండ: సాహిత్య, సాంస్కృతిక సేవా సంస్థ విశ్వ సాహితీ కళావేదికకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన జెట్టబోయిన శ్రీకాంత్‌ను సంస్థ చైర్మన్ కొల్లి రమావతి నియమించారు. కవితాశ్వమేధం పుస్తక రచయిత జాతీయవాది జెట్టబోయిన శ్రీకాంత్‌ను తెలుగు గజల్ గాయకుడు, నటుడు, ఉద్యమకర్త 125 ప్రపంచ భాషలలో గజల్స్ పాడటం ద్వారా మూడు గిన్నిస్ రికార్డులు సాధించిన గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా సన్మానించి నియామక పత్రం అందజేశారు. ఈ నెల 17 న ఆవిర్భవించిన కళావేదిక తెలుగు భాషా సంరక్షణ, సాహితీ విలువల సంస్థాపన ధ్యేయంగా పనిచేస్తుందని కవులకు రచయితలకు ఇది ఒక అద్భుతమైన వేదిక అని శ్రీకాంత్ అన్నారు.
వరద నీటి ప్రవాహంతో ప్రాణభయం
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వల్ల తమకు ప్రాణభయం ఉందని తెలియజేస్తూ గురువారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి మర్పల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు దిగువనకు మర్పల్లి గ్రామం ఉండటంతో గ్రామం చుట్టూ వరద నీరు చేరుతుందని తమకు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయిస్తే ఇళ్లు కట్టుకొని జీవనం సాగిస్తామని సబ్‌కలెక్టర్‌ను కోరారు. తమను ఆదుకోవాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్, మర్పల్లి గ్రామస్తులు ఉన్నారు.
నలుగురు విద్యార్థులు ఎంపిక
భిక్కనూరు: హైదరాబాద్ గౌలీపురలోని ఆలె నరేంద్ర స్టేడియంలో ఈ నెల 19న జరిగిన రాష్ట్ర స్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీల్లో భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, ఫిజికల్ డైరెక్టర్ వై.నర్సింహారెడ్డిలు తెలిపారు. అండర్–17 విభాగంలో పదో తరగతి చదువుతున్న జి.అంతోష్, బి.సుశాంత్, అండర్–15 విభాగంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బి.మహేశ్, డి.రాంచరణ్‌లు ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్టు వివరించారు. మహారాష్ట్రలోని షిరిడీలో ఈ నెల 23 నుంచి 28 వరకు జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
407 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
దోమకొండ: మండలానికి 407 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, ఇందిరమ్మ కమిటీ మెంబర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధులు తెలిపారు. లబ్ధిదారులకు గురువారం మంజూరు పత్రాలను అందజేశారు. వీవో యాదగిరి, మాజీ కో–ఆప్షన్ సభ్యులు షమ్మీ, అబ్రబోయిన రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

భిక్కనూరు బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు