
ఒంటరి మహిళలే టార్గెట్..!
కామారెడ్డి క్రైం: రెండు రోజుల క్రితం లింగంపేట సమీపంలో వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. లింగంపేటలోని మట్టకిందిపల్లి కాలనీకి చెందిన ఒడ్డె ఎరుగుదిండ్ల చిన్నక్క (41) భర్త గతంలోనే చనిపోగా కూలీ పనులు చేసుకుంటూ జీవించేది. ఈ నెల 4న పింఛన్ డబ్బులు తెచ్చుకుంటానని బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఆమె మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశారు. రామాయిపల్లి అటవీప్రాంతంలో చిన్నక్క మృతదేహాన్ని పోలీసులు రెండు రోజుల క్రితం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. హత్యగా నిర్ధారించి విచారణ కొనసాగించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడిని పర్మల్ల తండాకు చెందిన బదావత్ ప్రకాష్ అలియాస్ చిరంజీవిగా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడని ఎస్పీ తెలిపారు. ఈ నెల 4న నిందితుడు లింగంపేట కల్లు దుకాణం వద్ద చిన్నక్కను కలిసి మాటల్లో పెట్టాడు. డబ్బులు ఆశ చూపి తన వెంట అటవీప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేసి మృతురాలి సెల్‌ఫోన్ తీసుకుని పరారయ్యాడు. నిందితుడు ఒంటరిగా కనిపించిన మహిళలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడటం అలవాటు చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. గతంలోనూ దేవునిపల్లి పీఎస్ పరిధిలో ఓ మహిళ విషయంలో కూడా ఇదే తరహాలో హత్యకు పాల్పడగా ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉందన్నారు. కేసు చేధనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ లింగారెడ్డి, లింగంపేట ఎస్సై దీపక్ కుమార్, సిబ్బంది సంపత్, లిక్యా నాయక్, అనిల్, శివ, రాజులు, ప్రకాష్ లను ఎస్పీ అభినందించారు.
లింగంపేట హత్య కేసును
ఛేదించిన పోలీసులు
నిందితుడి అరెస్టు
వివరాలు వెల్లడించిన
ఎస్పీ రాజేష్ చంద్ర