
బహుముఖ ప్రజ్ఞాశాలి దేవాగౌడ్
● ప్రపంచ జానపద దినోత్సవం
సందర్భంగా దే వాగౌడ్‌పై కథనం
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని బ్లూబెల్స్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కర్రోల్ల దేవాగౌడ్ గాయకుడిగా, జానపద కళాకారుడిగా, కవిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సినీ ఆర్టిస్టుగా, లఘుచిత్ర దర్శకుడిగా, మోటివేషనల్ స్పీకర్గా, సోషల్ యాక్టివిస్ట్‌గా, డ్యాన్సర్‌గా, నృత్య దర్మకుడిగా విభిన్న ప్రతిభను చూపుతున్నారు. ఎంఎస్సీ, బీఎడ్ చదివి ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన 5వ తరగతి నుంచే దేశభక్తి గేయాలు, జానపద పాటలు పాడేవారు..ఉపన్యాసాలు, వ్యాసరచనలు చేశారు. 18 సంవత్సరాల నుంచి కళారంగంలో రాణిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో గద్దర్, దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్ మరెందరో కళాకారులతో ధూంధాం... కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించారు. లఘుచిత్రాల్లో నటిస్తూనే సినిమాల్లో నటించే అవకాశం అందుకున్నారు. ఎన్నో సన్మానాలు, 7 రాష్ట్ర స్థాయి, 7 జాతీయ స్థాయి, 2 అంతర్జాతీయ స్థాయి అవార్డులను కూడా అందుకున్నాడు. ఇటీవలె మదర్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో మల్టీటాలెంటెడ్ పర్సన్‌గా ఆయన పేరు నమోదైంది. పాల్వంచ మండలం ఫరీద్‌పేట్ గ్రామానికి చెందిన కర్రోల్ల సావిత్రి, నారాగాడ్ గార్ల మూడవ సంతానమే దేవాగాడ్. ఈయనకు భార్య సుమలత, కుమారుడు అఖిల్ గౌడ్, కుమార్తె వర్ణిక ఉన్నారు. తండ్రి గీత కార్మికుడు, వ్యవసాయదారుడు, తల్లి బీడీ కార్మికురాలు నిరుపేద కుటుంబంలో జన్మించినా చిన్నప్పటి నుంచే ఎంతో కష్టపడి చదివి, మనోధైర్యంతో, స్వశక్తినే నమ్ముకుని, తెలివితేటలతో, కళా రంగంతో పాటు వివిధ రంగాల్లో కూడా విజయాలు సాధిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా దేవాగౌడ్ మాట్లాడుతూ.. చదువు, ప్రతిభ ఉండి కళారంగంలో రాణిస్తున్నందుకు, తెలంగాణ సాంస్కృతిక సారథిలో తనకు ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటునట్లు తెలిపాడు.

బహుముఖ ప్రజ్ఞాశాలి దేవాగౌడ్