
దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టాలి
● మురికి కాలువలు శుభ్రం చేయించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: వర్షాల ప్రభావంతో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గురువారం పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాలు కురిసిన అనంతరం ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిల్వ ఉన్న నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు. డ్రై డేను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. మరోసారి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మురికి కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వనమహోత్సవం కార్యక్రమం ద్వారా కామారెడ్డి మున్సిపాలిటీకి నిర్దేశించిన రెండు లక్షల మొక్కలను ఈ నెలాఖరులోగా నాటాలన్నారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ చేసి ఆన్‌లైన్‌లో వివరాలను పొందుపర్చాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఆవరణలో మియావాకీ పద్ధతిలో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి ని ఆదేశించారు. ఆయన వెంట స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.