
పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మంజీరా నీటితో ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించి ఆదుకుంటామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. చీనూర్, బంజర, వెంకంపల్లి తదితర గ్రామాల్లో బుధవారం పర్యటించి నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. ముంపునకు గురైన పంటల వివరాలను స్థానిక అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదల కావడం వల్ల నాగిరెడ్డిపేట మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో సుమారు 1,500 నుంచి 2000 ఎకరాలు నీటమునిగాయన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంలో సింగూర్ జలాలతో పంటలు ముంపునకు గురవుతున్న విషయం తెలుసుకున్న తాను ఆదివారం రాత్రి నుంచి జుక్కల్ ఎమ్మెల్యేతోపాటు నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తించామని చెప్పారు. సర్వే చేయించి వివరాలను సేకరిస్తామన్నారు. సింగూర్ నుంచి నీరు విడుదలైన ప్రతిసారీ పంటలు మునుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా మంజీరనదిలో తుమ్మచెట్లను తొలగింపజేసేలా నీటిపారుదలశాఖ అధికారులు రూ.1.2 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారన్నారు. ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, నీటిపారుదలశాఖ డీఈఈ వెంకటేశ్వర్లు, నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, నాయకులు విక్రాంత్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, సుధాకర్, కిష్టయ్య, తదితరులున్నారు.