మాచారెడ్డి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కామారెడ్డి ఆర్డీవో వీణ సూచించారు. మంగళవారం ఘన్‌పూర్(ఎం) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ సరళ, ఎంపీడీవో గోపిబాబు, ఎంఈవో దేవేందర్‌రావ్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఎల్లారెడ్డిరూరల్: మహ్మద్‌నగర్ మండలంలోని నర్వ చెరువు కట్టపై మట్టి పోసి అలుగు ఎత్తు పెంచడంతో వెంకటాపూర్ గ్రామ శివారు పంటలు నీట మునుగుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని చెరువు కట్టపై పోసిన మట్టిని తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని వెంకటాపూర్ గ్రామస్తులు కోరారు. ఈమేరకు మంగళవారం తహసీల్దార్ ప్రేమ్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామస్తులు మల్లేష్, సాయిలు తదితరులున్నారు.
కామారెడ్డి అర్బన్: జాతీయ సామాజిక పని వారోత్సవాల సందర్భంగా స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీజీ సోషల్ వర్క్ విద్యార్థులు మంగళవారం మానవహారం ఏర్పాటు చేశారు. సోషల్ వర్క్ స్టడీస్ చైతన్యంతో సామాజిక సేవా ధృక్పథం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవాడుతాయని ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్ అన్నారు. కార్యక్రమంలో సోషల్‌వర్క్ విభాగాధిపతి జి.శ్రీనివాస్‌రావు, అధ్యాపకులు పీబీ సత్యం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి