
దారిదోపిడీ కేసులో భార్యాభర్తల అరెస్టు
కామారెడ్డి క్రైం: లిఫ్ట్ అడిగి దారిదోపిడీలకు పాల్పడుతున్న నిందితులను కామారెడ్డి పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన పెద్దల రాజు అనే వ్యక్తి కామారెడ్డిలోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. ఈ నెల 17న సాయంత్రం అతడు విధులు ముగించుకుని ఇంటికి తన బైక్‌పై బయలుదేరాడు. బస్టాండ్ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ లిఫ్ట్ అడగడంతో రాజు లిప్ట్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఆర్ గార్డెన్ వరకు వెళ్లగానే మరో బైక్‌పై గుర్తుతెలియని వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. సదరు గుర్తుతెలియని వ్యక్తి, మహిళ ఇద్దరూ కలిసి రాజుపై దాడి చేసి అతని వద్దనున్న రూ.2 వేలు నగదు, సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యారు. రాజు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న బైండ్ల లక్ష్మీ, ఆమె భర్త రాయపాని రవికుమార్‌గా గుర్తించారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. తెలిపారు. నిందితులు మాటల్లో పెట్టి లిఫ్ట్ ఇవ్వాలని అడిగి, గ్రామ శివారు ప్రాంతంలోకి వెళ్లగానే దాడి చేసి దోచేస్తారని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసును చేధించిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అభినందించారు.