
తల్లిదండ్రి.. తల్లడిల్లేలా..
అభ్యాగ్యులు ఎందరో..
ఎందరికో ఆశ్రయమిస్తున్న రైల్వే స్టేషన్..
కన్నవారిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పిల్లలు.. వారిని పట్టించుకోవడం లేదు. ఆస్తులు పంచుకుంటున్న సంతానం.. తనువిచ్చిన తల్లిదండ్రులకు కడుపునిండా అన్నం పెట్టడానికి మాత్రం ముందుకు రావడం లేదు. తిండికి బదులు ఈసడింపులు మాత్రం వడ్డిస్తున్నారు. తమను కని, గారాబంగా పెంచి, పెద్ద చేసినవారిని కొందరు దిక్కులేనివారిలా వృద్ధాశ్రమంలో వదిలేస్తుండగా, ఇంకొందరు దారుణంగా రోడ్డున పడేస్తున్నారు. దీంతో కన్నవారు తల్లడిల్లుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అమ్మ నవమాసాలు మో సి జన్మనిస్తుంది. నాన్న తన భుజాలపై మోసి పెంచుతాడు. బిడ్డ ఆకలి తీర్చేందుకు తమ ఆకలిని మర చిపోతారు. పిల్లల భవిష్యత్ కోసం తమ కోరికలను త్యజిస్తారు. కష్టాలను తాము మోసి.. బిడ్డలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ఆరాటపడతారు. పెరిగి పె ద్దయ్యేదాకా కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు..తమకు చేతనైనన్ని రోజులు మన కోసమే కష్టపడతారు. వయసురీత్యా సంక్రమించే వ్యాధుల తో తమ పని కూడా తాము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి మేమున్నామనే భరోసా ఇవ్వాల్సిన కొడుకులు, కోడళ్లు.. వారిని భారంగా భావిస్తున్నారు. జీవిత చరమాంకంలో వారి ఆలనాపాలనా చూడకుండా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడుకోవలసిన బాధ్యతల నుంచి చాలా మంది తప్పుకుంటున్నారు. ఇటీవల కామారెడ్డి రైల్వేస్టేషన్ వెనకవైపు ఉన్న షెడ్డు కింద వృద్ధురాలు శకుంతల పడుతున్న ఇబ్బందుల్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు స్పందించి ఆమెను వృద్ధాశ్రమానికి చేర్చారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ‘సాక్షి’ కథనాన్ని సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది.
శకుంతల ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానీ ఇలా వెలుగులోకి రాని వారందరో ఉన్నారు. కన్నబిడ్డలు కాదనడంతో ఎందరో అభాగ్యులు వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్నారు. జీవిత చరమాంకంలో మనవలు, మనవరాళ్లతో ఆనందంగా గడపాల్సిన వారు అందరు ఉన్నా అనాథలుగా బతకాల్సి వస్తోంది. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని ఓ వృద్ధాశ్రమంలో 25 మంది వరకు వృద్ధ మహిళలు ఉంటున్నారు. అలాగే లింగంపేటలోని ఆశ్రమంలో తొమ్మిది మంది ఉంటున్నారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ఓ ఆశ్రమంలో జిల్లాకు చెందిన వృద్ధులు పలువురు ఆశ్రయం పొందుతున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ సమీపంలో ఉన్న ఓ ఆశ్రమంలోనూ ఈ ప్రాంతానికి చెందిన వృద్ధులు ఉంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని ఆశ్రమాల్లో చాలా మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగు జిల్లాలకు చెందిన పలువురు వృద్ధులు కన్నబిడ్డల ఆదరణ లేకపోవడంతో ఆకలి తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నారు. కొందరు ఆత్మాభిమానం చంపుకోలేక ఎక్కడో ఓ చోటు వెదుక్కుని చావు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఇలాంటివారికి ఎందరికో ఆశ్రయమిస్తోంది. గతంలో స్టేషన్ ముందు ఉండే షెడ్డులో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆశ్రయం పొందేవారు. మరికొందరు ప్లాట్‌ఫాంలపై గడిపేవారు. స్టేషన్ పునరుద్ధరణ పనులతో అనాథలు, వృద్ధులు పగలు ఎక్కడెక్కడో తిరిగి రాత్రి దుకాణాలు మూసిన తర్వాత వాటి అరుగులపై సేదతీరుతున్నారు. ఎవరైనా దయతలచి నాలుగు మెతుకులు పెడితే తింటారు. లేదంటే పస్తులుంటారు. వృద్ధుల సంరక్షణ కోసం ఎన్నో చట్టాలున్నా.. ముసలి తల్లిదండ్రులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారి విషయంలో చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని వృద్ధుల సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పుడే జీవిత చరమాంకంలో కాసింత గౌరవప్రదమైన జీవనం దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ముసలోళ్లయ్యారని
వదిలించుకుంటున్న సంతానం
అందరు ఉన్నా అనాథలుగా
జీవిస్తున్న పలువురు వృద్ధులు