
సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి
● రాజ్యాంగాన్ని మార్చే కుట్ర మానుకోవాలి
● ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాల ప్రజలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ‘రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటోందన్నారు. సమాన అవకాశాలు కల్పించాలని చెబుతున్న రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటివరకు పంటలకు గిట్టుబాటు ధర లేక దేశవ్యాప్తంగా లక్షకుపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు ప్రధాని మోదీ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. దోపిడి రహిత సమాజం కోసం సీతారాం ఏచూరి ఎంతగానో కృషి చేశారంటూ ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నాయకులు వెంకట్రాములు, వెంకట్‌గౌడ్, మోతీరాం నాయక్, నర్సింలు, రేణుక, అరుణ్, అజయ్, రవీందర్, సురేష్, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.