
‘పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం’
నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం రూ. 10 కోట్లు మంజూరు చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. గేట్ల నిర్వహణ, వరద నీటి మళ్లింపు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోల వివరాలను జిల్లా నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. గోల్ బంగ్లా వద్ద పర్యాటక అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు. ముంపు గ్రామాలతో పాటు పురాతన ఇళ్లలో నివసిస్తున్నవారు పునరావాస కేంద్రాల్లో ఉండాలని కలెక్టర్ సూచించారు. వారి వెంట మండల ప్రత్యేకాధికారి రమాదేవి, ఈఈ సోలోమాన్, తహసీల్దార్ భిక్షపతి, ఏఈలు శివప్రసాద్, సాకేత్, ఎంపీడీవో గంగాధర్, ఎస్సై శివకుమార్ తదితరులున్నారు.