
నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు
బిచ్కుంద: నిజాంసాగర్, కౌలాస్ నాలా ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శెట్లూర్ గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న మంజీర నదిలో సోమవారం గుండెకల్లూర్ గ్రామానికి చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 657 గొర్రెలు, శెట్లూర్‌కు చెందిన ఒక రైతులో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలపడంతో వారు అధికారులు, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు సమాచారం అందించారు. దీంతో డిచ్‌పల్లినుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సహాయక బృందాలను రపించి సహాయక చర్యలు చేపట్టారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విఠల్‌రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాల్ తదితరులు తెల్లవారుజామున 5 గంటలకు శెట్లూర్ మంజీర నది వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెస్క్యూ బృందం ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు సహాయక చర్యలు చేపట్టి 657 జీవాలను, నలుగురు వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. సాయిగొండ, యాదుగొండ, సాయిగొండ, రైతు చాకలి సాయిలులను బోట్‌లో ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు. రెండు బోట్ల సహాయంతో ఒక్కో బోటులో 25 నుంచి 30 గొర్రెల చొప్పున తీసుకువచ్చారు.
అధికారులను అభినందించిన ఎమ్మెల్యే
కాపరులు, గొర్రెలు చిక్కుకున్న ప్రదేశానికి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బోట్‌లో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఎస్పీ విఠల్‌రెడ్డితోపాటు ఇతర అధికారులు, రెస్క్యూ టీంను అభినందించారు. పశువైద్యులను పిలిపించి, గొర్రెలకు వైద్య పరీక్షలు చేయించారు. సహాయక చర్యలలో సహకారం అందించిన యువకులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతి అందించారు.
నలుగురు వ్యక్తులు, 657 గొర్రెలను
కాపాడిన రెస్క్యూ టీం
సహాయక చర్యలను పర్యవేక్షించిన
ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు,
సబ్ కలెక్టర్ కిరణ్మయి

నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు

నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరులు