
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
నస్రుల్లాబాద్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి నీట మునిగి మృతి చెందిన ఘటన దుర్కి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన గుడిసె రాజు(28) సోమవారం ఉదయం నస్రూల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని మాంధారి చెరువు అలుగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. భారీ వర్షాల ధాటికి అలుగు 765డీ మీదుగా పారుతోంది. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అలుగు కోసం మొరం కింద నుంచి పైపులు వేశారు. వరద ఉధృతికి మొరం కొట్టుకుపోయింది. రహదారి ఎగువ భాగాన దిగిన రాజు నీట మునిగిపోయాడు. ఎంతకీ బయటకు రాకపోవడంతో తోడుగా వచ్చిన వ్యక్తి కుటుంబీకులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు గజ ఈతగాళ్లతో గాలించగా పైపులైన్‌లో మృతదేహం లభించింది. కాగా, రహదారి పనులు నెమ్మదిగా జరగడంతోనే రాజు మరణించాడని ఆరోపిస్తూ కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మృతుడికి ఓ కూతురు ఉంది.
అదుపు తప్పిన స్కూటీ...
నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లి క్రాస్‌రోడ్ వద్ద స్కూటీ అదుపు తప్పి ఓ యువతి సైడ్ డ్రెయిన్‌లో పడిపోయింది. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సబ్‌స్టేషన్ ఎదుట ఉన్న తాత్కాలిక మట్టిదారి పూర్తిగా కొట్టుకుపోయింది. సోమవారం ఉదయం డ్రెయిన్ దాటుతుండగా యువతి స్కూటీతో సహా అందులో పడిపోయింది. రోడ్డు పనులు చేస్తున్న కూలీలు గమనించి ఆమె పైన ఉన్న వాహనాన్ని తీసి కాపాడారు.
నిజామాబాద్‌నాగారం: జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన క్యూరియస్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు మయాంక్ తేజ్, శీతల్ ఎంపికై నట్లు కోచ్ వినోద్ నాయక్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ నెల 17న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చారన్నారు. ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఒడిశా రాష్ట్రంలోని కటక్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీలో మయాంక్ తేజ్, శీతల్ పాల్గొననున్నారు. ఎంపికై న క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డా. రమేశ్ పవార్, ప్రెసిడెంట్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్ నాయక్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
● ఆర్మూర్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఏర్పాటు
● రూ.45 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు
ఆర్మూర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణనిచ్చేందుకు రెండు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్మూర్ మండల కేంద్రంతోపాటు బాన్సువాడ పరిధిలోని వర్నిలో రూ.45 కోట్ల వ్యయంతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు పరిపాలన అనుమతులతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.దాన కిశోర్ విడుదల చేశారు. కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల విభాగంతోపాటు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టీటీఎల్) సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలలో 46 ఏటీసీల ఏర్పాటుకు ఉత్తర్వులు అయ్యాయి. అందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రెండు కేంద్రాలు మంజూరు కావడంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రత్యేక చొరవతో ఈ ఏటీసీల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయడంపై ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి

చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి