
కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీల ఆందోళన
కామారెడ్డి క్రైం: తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌లు ప్రధాన రహదారిపై బైఠాయించి రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షడు చంద్రశేఖర్ మాట్లాడుతూ.. విద్యావాలంటీర్లకు నిర్ణయించిన వేతనాన్ని అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్‌లకే అదనంగా ఇవ్వాలన్నారు. ఐసీడీఎస్‌తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడాల్సింది పోయి అమలుకు పూనుకుంటోందని విమర్శించారు. అంగన్‌వాడీ సేవలకు తప్పనిసరి చేసిన ఎఫ్‌ఆర్‌ఎస్(ఫేస్ క్యాప్చర్ సిస్టం) విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆధునిక సాంకేతికతతో కూడిన కంప్యూటర్‌లు, ట్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లు ఇవ్వాలని కోరారు. జిల్లా అధికారులు వచ్చి తమ సమస్యలు వినాలని అంగన్‌వాడీలు పట్టుబట్టడంతో పోలీసులు వారిని సముదాయించారు. చివరకు జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల అక్కడకు వచ్చి వినతిపత్రం స్వీకరించారు. దీంతో అంగన్‌వాడీలు వెనుదిరిగారు. సీఐటీయూ జిల్లా నాయకులు అరుణ్ కుమార్, నర్సింలు, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.