
పోటెత్తిన వరద.. అర్ధరాత్రి గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్: నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులలోకి ఆదివారం అర్ధరాత్రి వేళ వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే గేట్లను ఎత్తారు. దీంతో ప్రాజెక్టులు ప్రమాదకర స్థాయిలనుంచి బయటపడ్డాయి. రాత్రి 1.20 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో 7 గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదిలారు. 2022 తర్వాత ఈ స్థాయిలో ఇన్‌ఫ్లో రావడం ఇదే తొలిసారి.
కొనసాగుతున్న ఇన్‌ఫ్లో..
ఎగువ ప్రాంతాల్లో దంచికొడుతున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో 85 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 15 గేట్ల ద్వారా 85 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1,402.75 అడుగుల (14.654 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.
భారీ వర్షంలోనూ..
నిజాంసాగర్, కౌలాస్ ప్రాజెక్టులలోకి అర్ధరాత్రి వేళ భారీగా వరద నీరు రావడంతో అధికారులు ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న ఎ మ్మెల్యే లక్ష్మీకాంతారావు వెంటనే స్పందించారు. వెంటనే ఆయా ప్రాజెక్టులను సందర్శించి అధికారులతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ప రిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వరద గేట్ల ను ఎత్తడానికి అధికారులకు సహాయం చేశారు.