
మళ్లీ కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
నిజాంసాగర్: సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ మళ్లీ కొట్టుకుపోయింది. దీంతో నీరంతా వృథా అవుతోంది. గతేడాది కురిసిన భారీ వర్షాలవల్ల వరదనీరు పోటెత్తడంతో సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ (అడ్డుగోడ) కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే వరద నీటిని కాపాడేందుకు తాత్కాలికంగా ఇసుక బస్తాలను అడ్డుగా వేసి మట్టి కట్టలు వేశారు. దీనికి రూ. 8.4 లక్షలు వెచ్చించారు. అయితే శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆదివారం అర్ధరాత్రి దాటాక మరోసారి రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయింది. సుమారు 14 మీటర్ల మేర అడ్డుగోడ కొట్టుకుపోవడంతో పాటు 10 మీటర్ల మేర రిటెయినింగ్ వాల్ శిథిలావస్థకు చేరుకొని కూలడానికి సిద్ధంగా ఉంది.
గతేడాది కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్‌కు అ ప్పట్లో రూ. 8.4 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. అనంతరం నీటిపారుదలశాఖ అధికారు లు వాల్ నిర్మాణం కోసం రూ. 1.8 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ సర్కారు నిధులు మంజూరు చేయలేదు. భారీ వర్షాలు కురిస్తే మళ్లీ రిటెయినింగ్‌వాల్ కొట్టుకుపోయే అవకాశాలున్నాయని ‘సాక్షి’ ముందే హెచ్చరించింది. అయినా పాలకులు శ్రద్ధ వహించకపోవడంతో మరోసారి కొట్టుకుపోయింది. దీంతో నీరు వృథాగా పోతుండడంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖాళీ అవుతున్న సింగితం నీరు!