
విద్యుత్ షాక్‌తో గేదె మృతి
మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్‌పేట్‌లో శనివారం విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందినట్లు పంచాయతీ కార్యదర్శి సంజయ్ తెలిపారు. విద్యుత్ తీగల కింద గేదె మేత మేస్తుండగా విద్యుత్ తీగలు తెగి గేదైపె పడ్డాయి. దీంతో గేదె కరెంట్‌షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. కళేబరానికి పంచనామ నిర్వహించి మేనూర్ విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈకి సమాచారం అందించినట్లు ఆయన వెల్లడించారు.
దాబాపై పోలీసుల దాడి
ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్ శ్రీమాతా దాబాపై శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. దాబాలో మద్యం తాగేందుకు అనుమతిస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. దాబా యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతులు లేని దాబాలలో మద్యం సేవించవద్దని ఎస్సై మద్యం ప్రియులకు సూచించారు.
పేకాడుతున్న 10మంది అరెస్టు
ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్లపేట శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం రావడంతో శుక్రవారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.43,150ల నగదు, 10 సెల్‌ఫోన్లు, 11 బైకులు సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. మరో నలుగురు పరారైనట్లు ఆయన తెలిపారు.
గుంతలో దిగపడిన లారీ
నస్రుల్లాబాద్: మండల కేంద్రంలో ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కన గుంతలో దిగబడిపోయింది. మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతుండగా రహదారి పక్కన గుంతలు తవ్వా రు. ఈక్రమంలో శుక్రవారం మండల కేంద్రంలోని సమీకృత భవనం ఎదురుగా వర్ని వైపునకు వెళుతున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో దిగిపోయింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రోడ్డు పనుల నేపథ్యంలో హెచ్చరిక బోర్డులు, బార్డర్ లైన్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.