
డ్రెయినేజీలను శుభ్రం చేయించండి
కామారెడ్డి క్రైం: మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. మురికి కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలనీల్లో ఎక్కడా మురికి కాలువలు మూసుకుపోకుండా చూడాలన్నారు. అటంకం లేకుండా మురికి నీరు ప్రవహించేలా శుభ్రం చేయించాలన్నారు. మురుగు నీరు రోడ్ల మీదికి, ఇళ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రెయినేజీలను వెంటనే శుభ్రం చేయించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. క్రమం తప్పకుండా వాహనాల ద్వారా చెత్త సేకరణ జరగాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పరికరాలను అందజేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రెయిన్ కోట్స్, అత్యవసర సామగ్రిని అందజేయడానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, తహసీల్దార్ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు.
మురుగునీరు రోడ్లపైకి
రాకుండా చూడండి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్