దొంగకు కీ ఇవ్వొద్దు! | - | Sakshi
Sakshi News home page

దొంగకు కీ ఇవ్వొద్దు!

May 15 2025 1:27 AM | Updated on May 15 2025 1:27 AM

దొంగక

దొంగకు కీ ఇవ్వొద్దు!

ఈనెల 11న రాత్రి సదాశివనగర్‌ మండలం యాచారం తండాలో దొంగలు జగదాంబ మాత ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి హుండీ చోరీ చేశారు.

15 రోజుల క్రితం తాడ్వాయికి చెందిన సాయిలు కుటుంబం తాళం వేసి ఊరెళ్లింది. దొంగలు ఆ ఇంటి తాళం పగులగొట్టి, 40 తులాల వెండి, కొంత నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజున పక్క కాలనీలోని పరశురాములు ఇంట్లో కూడా చోరీ చేసి బంగారం, నగదు అపహరించారు.

ఈనెల 8 న వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు 8 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఈనెల 7 న గాంధారి మండలం పొతంగల్‌ ఖుర్దు గ్రామంలో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఓ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి నగదు, బంగారం అపహరించారు. అదే రోజు రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంపుకెళ్లారు.

20 రోజుల క్రితం బాన్సువాడకు చెందిన సాయవ్వ ఇంటికి తాళం వేసి డాబాపై పడుకుంది. దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

గత నెల 29న పొతంగల్‌ మండలం హంగర్గాలో పుట్టి రాములు ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి మేడపై పడుకున్నారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో చోరులు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

– కామారెడ్డి క్రైం

గతనెల 12 న బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో తాళం వేసిన రెండిళ్లలో చోరీలు జరిగాయి.

సాధారణంగా వేసవిలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా చేతివాటం ప్రదర్శిస్తునారు. వేసవి సెలవుల్లో పట్టణాల నుంచి చాలా మంది స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు, ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లోనే తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడానికి దొంగలు పథకాలు వేస్తుంటారు.

పగలు రెక్కీ.. రాత్రికి చోరీలు..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను కలిగి ఉంది. దీంతో ఇక్కడ దొంగల బెడద మొదట్నుంచీ ఎక్కువే. కర్ణాటకలోని బీదర్‌, మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రాంతాలకు చెందిన దొంగలు, పార్థీ గ్యాంగ్‌ లాంటి ముఠాలు ఎక్కువగా ఇక్కడ చోరీలకు పాల్పడుతుంటాయి. ఇటీవల ఇతర రాష్ట్రాల దొంగల ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. వీరు ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తుంటారు. అంతేకాక ఏకంగా కత్తులతో బెదిరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి. దొంగలు పగటిపూట కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను ఎంచుకుంటారని, అర్ధరాత్రి దాటాక ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటారని తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో తమ ఆనవాళ్లు తెలియకుండా ముసుగులు ధరించడం, నంబర్‌ ప్లేట్‌ లేని వాహనాలపై సంచరించడం చేస్తున్నారు. దీంతో వారిని గుర్తించడంలో పోలీసులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

అప్రమత్తంగా ఉంటేనే..

బంగారం, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు ఇంట్లో ఉంచడం కంటే.. బ్యాంకు లాకర్‌లో గానీ, బంధువుల వద్ద గానీ దాచుకోవడం ఉత్తమం.

ఇంటికి వేసిన తాళం బయటికి కనిపించకుండా కర్టెన్‌తో కప్పి ఉంచాలి. సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఊరెళ్లే వారు సమీపంలోని పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుంది.

బీరువా తాళాలు దొంగలకు తేలికగా దొరికే ప్రదేశాల్లో పెట్టకూడదు.

కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

ఉమ్మడి జిల్లాలో రెచ్చిపోతున్న చోరులు

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌

జాగ్రత్తలు పాటించాలని

సూచిస్తున్న పోలీసులు

దొంగతనాల నివారణకు చర్యలు..

ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో దొంగతనాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలి.

– రాజేశ్‌ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి

దొంగకు కీ ఇవ్వొద్దు!1
1/2

దొంగకు కీ ఇవ్వొద్దు!

దొంగకు కీ ఇవ్వొద్దు!2
2/2

దొంగకు కీ ఇవ్వొద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement