క్లౌడ్ బరస్ట్..!
భారీ వర్షాలతో నీటమునిగిన కామారెడ్డి పట్టణం (ఫైల్)
ఈ ఏడాది వరుణుడు బీభత్సం సృష్టించాడు. మేఘాలకు చిల్లులు పడ్డట్టుగా ఆగస్టు ఆఖరి వారంలో దంచికొట్టిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వందలాది ఇళ్లు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు, వంతెనలు వరదల్లో కొట్టుకుపోయాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులకూ తీవ్ర నష్టం వాటిల్లింది. పరామర్శలే తప్ప పరిహారం రాక అన్నదాతలు నిరాశ చెందారు. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు సైతం నిధులు మంజూరు కాకపోవడంతో ఆయా మార్గాలలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
జిల్లాకేంద్రంలోని ఓ కాలనీలో వరద బాధితులను రక్షిస్తున్న పోలీసులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 2025 సంవత్సరంలో క్లౌడ్ బరస్ట్ పెద్ద విపత్తును తెచ్చిపెట్టింది. వరదలతో నలుగురి ప్రాణాలు ఆవిరవగా, పదుల సంఖ్యలో పశువులు, వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వరదలతో దెబ్బతిన్న పంటలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కేంద్ర ప్రభుత్వ బృందం వచ్చి చూసి వెళ్లినా రైతులకు నయాపైసా పరిహారం అందలేదు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులూ రాలేదు.
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ. 38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ. 212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో 50 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. సీఎం పర్యటన సమయంలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. తర్వాత పంట నష్టం లెక్కలు తగ్గించారు. పెట్టిన పెట్టుబడులే దాదాపు రూ. వంద కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. నీట మునిగిన పంటలతో పాటు, వరదలతో కొట్టుకుపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ ద్వారా శాశ్వత మరమ్మతు పనులు చేపట్టేందుకు రూ.125.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ.45.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. కానీ నిధులు మంజూరు కాకపోవడంతో పనులు అలాగే ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌజింగ్‌బోర్డు కాలనీల్లో వందలాది ఇళ్లు వరదల్లో మునిగిపోయి సామగ్రితో పాటు ద్విచక్రవాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. భారీగా నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటించి, దెబ్బతిన్న పంటలు, రోడ్లు, వంతెనలను పరిశీలించారు. వరదల్లో మునిగి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. కానీ పరిహారం కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
భారీ వరదలతో
అతలాకుతలమైన జిల్లా
దెబ్బతిన్న రోడ్లు.. కొట్టుకుపోయిన
వంతెనలు
ఇళ్లలోకి చేరిన వరద నీరు..
ఇబ్బందిపడ్డ ప్రజలు
అన్నదాతకు అపార నష్టం..
ఆదుకోని సర్కారు
క్లౌడ్ బరస్ట్..!
క్లౌడ్ బరస్ట్..!
క్లౌడ్ బరస్ట్..!


