జిల్లాలో యూరియా కొరత లేదు
● సమస్యలుంటే ఫిర్యాదు చేయండి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచామన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా లభ్యత, యూరియా బుకింగ్ యాప్ తదితర అంశాలపై సమీక్షించి, పలు సూచనలు ఇచ్చారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో యాసంగి సీజన్‌కుగాను 39,645 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 24,812 మెట్రిక్ టన్నులు వచ్చిందని తెలిపారు. దీంట్లో నుంచి ఇప్పటికే 16,745 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 14,833 మెట్రిక్ టన్నుల యూరియా త్వరలోనే జిల్లాకు రానుందన్నారు. జిల్లాలోని అన్ని కౌంటర్లలో ఉదయం 6 నుంచి యూరియా విక్రయాలు ప్రారంభం అవుతాయన్నారు. రైతులు తమ పట్టా పాస్‌పుస్తకం, ఆధార్ కార్డులను తప్పనిసరిగా వెంట తీసుకుని వెళ్లాలని సూచించారు. కౌంటర్ల దగ్గర రైతులకు కనీస సౌకర్యాలను అందించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. యూరియా పక్కదారి పట్టకుండా ప్రత్యేక తనిఖీల బృందాలను ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారికి సూచించారు. యూరియాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయి టోల్‌ఫ్రీ నంబర్ 1800 599 5779 కు గానీ, జిల్లా స్థాయి టోల్‌ఫ్రీ నంబర్ 89777 46047 లోగానీ సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఏవో మోహన్‌రెడ్డి, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.


