చైనా మాంజా నిషేధం
● విక్రయించినా, వినియోగించినా
కఠిన చర్యలు
● ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: పర్యావరణానికి తీవ్రమైన విపత్తుగా మారిన చైనా మాంజా(సింథటిక్/నైలాన్ దారం) విక్రయాలు, వినియోగంపై జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేస్తున్నామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. సంక్రాంతి నేపథ్యంలో చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాంలు, మార్కెట్‌లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. చైనా మాంజాను ఉపయోగించి గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక పక్షులు, పశువులు, ప్రజలు, ముఖ్యంగా బైక్‌లపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. చైనా మాంజాను విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం నేరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఎలాంటి హాని కలిగించని సాధారణ పత్తి దారాన్ని మాత్రమే ఉపయోగించి గాలిపటాలు ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో చైనా మాంజా విక్రయానికి సంబంధించి పలువురిపై కేసులు నమోదు చేసి, రూ.1.52 లక్షల విలువైన 65 బెండళ్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా చైనా మాంజా విక్రయాలు జరిగితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గాని, డయల్ 100 కు గానీ సీసీఎస్ సీఐ శ్రీనివాస్ (సెల్: 8712686112) కు గానీ సమాచారం అందించాలని ఒక ప్రకటనలో కోరారు.


