మాచారెడ్డి : పాల్వంచ మండలం ఫరీద్‌పేట గ్రామంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో గురువారం మంటలు చెలరేగాయి. వెంటనే తేరుకున్న సిబ్బంది సరఫరాను నిలిపివేసి మంటలను ఆర్పారు. ఎండవేడిమికి కెపాసిటర్లు కాలిపోవడంతో మంటలు అంటుకున్నట్లు విద్యుత్ సిబ్బంది తెలిపారు. అనంతరం కెపాసిటర్‌కు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
ఫైనాన్స్ కార్యాలయానికి నిప్పు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జక్సాని శ్రీహరికి చెందిన ఫైనాన్స్ కార్యాలయ తలుపులకు బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. గమనించిన స్థానికులు యజమానికి సమాచారం అందించి మంటలను ఆర్పివేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. కాగా, ఇదే కాలనీలో గతంలో ఓ ఇంట్లో బంగారు ఆభరణాలు అపహరించి దుండగులు బట్టలకు నిప్పు పెట్టి పారిపోయారు. మరోసారి అదేవిధంగా జరగడంతో కాలనీవాసులు భయాందోళన చెందుతున్నారు.
కిరాణా దుకాణం దగ్ధం
మాక్లూర్: మండలంలోని మదన్‌పల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఓ కిరాణా దుకాణం కాలిబూడిదైంది. మ దన్‌పల్లికి చెందిన అమ్ముల నాగరాజు జీవనోపాధి కోసం నెల రోజుల క్రితం గ్రామంలో ఓ మడిగెను అద్దెకు తీసుకొని కిరాణా దుకాణం నడుపుతున్నాడు. గురువారం దుకాణం పూర్తిగా దగ్ధం కాగా, అందులో ఉన్న సుమారు రూ.2 లక్షల విలువజేసే సరుకులు కాలిబూడిదయ్యాయి. విద్యుదాఘాతంతో జరిగిందా? ఎవరైనా నిప్పు పెట్టారా? అనేది తెలియడం లేదని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయమై తహసీల్దార్, పోలీసులకు ఫిర్యాదు చేశామని నాగరాజు తెలిపారు.