కామారెడ్డి క్రైం: నీటి సమస్యలు పెరిగి ప్రజలు రోడ్ల పైకి రాకుండా ముందే అధికారులు సమస్యల పరిష్కారం కోసం ముందస్తు చర్యలు చేపట్టాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డివిజనల్ పంచాయతీ అధికారులతో సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నీటి సమస్యలతో ప్రజలు రోడ్లెక్కకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై ఉందన్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తూ ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. స్థానిక అవసరాలను బట్టి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వచ్చే జూన్ వరకు నీటి సమస్యలు ఉండే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో ఉన్న ట్యాంకర్లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏవైనా మరమ్మత్తులు ఉంటే చేయించాలని సూచించారు.
ట్యాంకర్లతో నీటి సరఫరా..
జిల్లా కేంద్రంలో ట్యాంకర్లతో నీటి సరఫరా చేయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, నియోజక వర్గం లోని 48 గ్రామాల్లో నీటి సమస్యల పరిష్కారాలకు రూ.53.36 లక్షల నిధులు కేటాయించామన్నారు. ఆనిధులతో ఆయా గ్రామాలలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 5 కొత్త ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నామని, మరో 3 పాత ట్యాంకర్లతో కలిపి అవసరం ఉన్న ప్రాంతాల్లో నీటి సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే మరో 4 ట్యాంకర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే గ్రామ పంచాయతీ నిధుల నుంచి పనులు చేపట్టాలని, ఇతర నిధులను సైతం సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. ఎక్కడైనా తాగు నీటి ఇబ్బందులు ఏర్పడితే వెంటనే అవసరమైన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని మిషన్ భగీరథ, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, మండల పరిషత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన సీసీ రోడ్ల పనులు ఈ నెలాఖరు లోగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేష్, డీపీవో మురళి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీవోలు, డీపీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
హాజరైన అధికారులు
నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోండి
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
ఎమ్మెల్యేను కలిసిన పట్టణ అభివృద్ధి సంఘం సభ్యులు
కామారెడ్డి టౌన్: పట్టణ అభివృద్ధి సంఘం, ఉగాది ఉత్సవ సమితి సభ్యులు గురువారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కలిశారు. ఉగాది ఉత్సవాలకు హజరుకావాలని ఆహ్వానించారు. అలాగే వీక్లీమార్కెట్‌లో ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.కార్యక్రమంలో సభ్యులు ముదాం శ్రీనివాస్, బొజ్జ రవీందర్, స్వామి, బాల్‌రాజు, శ్రీనివాస్, నరేష్‌రెడ్డి తదితరులున్నారు.
ప్రజలు రోడ్డెక్కకుండా చూడండి