● ‘పుర’ పోరు ఫలితం నేడే
● జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో
ఓట్ల లెక్కింపు
● తొలుత కౌన్సిలర్లు, అనంతరం చైర్‌పర్సన్ ఎన్నికల ఫలితాలు
● 96 కౌంటింగ్ టేబుళ్ల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పురపాలక పోరుకు చివరి అంకమైన ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. బ్యాలెట్ బాక్సుల్లో ఉన్న మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ల భవితవ్యం తేలనుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే పూర్తి చేశారు.
ఉదయం 8 గంటలకు ప్రారంభం
జిల్లాలోని తుని, గొల్లప్రోలు, పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, ఏలేశ్వరం మున్సిపాలిటీల్లో పాలకవర్గాల ఎన్నికకు ఆదివారం పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయా కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి, ఆయా మున్సిపాలిటీల్లో సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూములకు ఆదివారం రాత్రికే తరలించారు. స్ట్రాంగ్ రూములకు సీల్ వేసి, 24 గంటల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు నిక్షిప్తం చేసిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలనుంది. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత 25 చొప్పున బ్యాలెట్ పేపర్లను కట్టలుగా కడతారు. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం, కట్టలు కట్టిన ఓట్లను లెక్కిస్తారు. గొల్లప్రోలు, ఏలేశ్వరం ఫలితాలు తొలిగా వెలువడుతాయి. అనంతరం, తుని పురపాలక సంఘం ఫలితాలు రానున్నాయి. ముందు కౌన్సిలర్లు, అనంతరం చైర్మన్ ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపునకు ఆయా మున్సిపాలిటీల వారీగా మొత్తం 96 కౌంటింగ్ టేబుళ్లను అధికారులు సిద్ధం చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను నియమించారు.
అభ్యర్థుల్లో ఉత్కంఠ
మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో తమ భవితవ్యంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎవరిని విజయం వరిస్తుంది.. ఎవరు ఓటమి చవిచూడాల్సి వస్తుందనే లెక్కల్లో వారు తలమునకలయ్యారు. మరోవైపు కూటమి నేతల్లో అంతర్మథనం మొదలైంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మద్యం, ఇసుక, మట్టి అక్రమాలకు నేతలు బరితెగించడం, ప్రభుత్వ పథకాలు సైతం అమలు చేయకపోవడం, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు. పైగా అధికార మదంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు సాగిస్తున్న అరాచకం, దాడులు, ప్రజాస్వామ్య విచ్ఛిన్నకర పోకడలపై జనంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని గుబులు చెందుతున్నారు. అలాగే, కొద్ది నెలలుగా బియ్యం, పంచదార, వంటనూనెలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో పెరిగిపోయాయి. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ధరలను అదుపు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు తమను ఆశీర్వదిస్తారా, లేదా అనే మీమాంస వారిలో నెలకొంది. మరోవైపు వైఎస్సార్ సీపీ శ్రేణులు మాత్రం విజయం సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బెట్టింగ్‌ల జోరు
ఇదిలా ఉండగా ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల విజయాలపై పలుచోట్ల బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఆ వార్డు అభ్యర్థి గెలుస్తారని, ఓట్ల వ్యత్యాసం, డిపాజిట్ గల్లంతు ఇలా ప్రతి అంశంపై కొంత మంది భారీగా బెట్టింగ్‌లు వేస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం, తుని పురపాలక సంఘాల్లో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి.
జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాలు ఇలా..
మున్సిపాలిటీ కౌంటింగ్ సెంటర్ టేబుళ్లు
పెద్దాపురం రామారావుపేట బ్రాహ్మణ కల్యాణ మండపం 16
సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కాలేజీ యోగా హాలు 18
పిఠాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల 18
తుని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, బ్యాంక్ కాలనీ 18
గొల్లప్రోలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల 8
ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 18


